బాబోయ్.. సెకనులో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్

సాధారణంగా ఒక సినిమా డౌన్‌లోడ్‌ చేయాలంటే 100 ఎంబీపీఎస్‌ వేగం ఉంటే ఐదారు నిమిషాల్లో డౌన్‌లోడ్‌ చేసేయొచ్చు. అయితే, సెకనులో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వెయ్యి సినిమా డౌన్‌లోడ్‌ చేశారట ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు. అది కూడా హెచ్‌డీ (హై డెఫినేషన్‌) సినిమాలు. ఆస్ట్రేలియాలోని మోనాష్‌, స్విన్‌బర్న్‌, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తయారు చేసిన సింగిల్‌ ఆప్టికల్‌ చిప్‌తో దీన్ని సుసాధ్యం చేశారు.

సెకనుకు 44.2 టెరాబైట్ల వేగంతో పనిచేసే చిప్‌ను వీరు తయారు చేశారు. 80 లేజర్ల సామర్థ్యం కలిగిన పరికరాన్ని రూపొందించారు. దీన్ని మైక్రో కోంబ్‌గా పిలుస్తున్నారు. లైటర్‌ కన్నా చిన్నదిగా ఉన్న ఈ చిప్‌ టెలికమ్యూనికేషన్‌లో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగానికి అనుగుణంగా దీన్ని మారిస్తే వాస్తవ జీవితంలో మరిన్ని మార్పులు వస్తాయని చెబుతున్నారు.