ఆంధ్రా గ్రీన్స్ ప్రారంభం

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆంధ్రా గ్రీన్స్‌ (andhragreens.com) వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.

కరోనా కారణంగా రైతుల ఉత్పత్తుల విక్రయాలకు ఇబ్బంది కలిగింది. ఈ సమస్యను పరిష్కరించాలనే ఈ తరహా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ఆంధ్రా గ్రీన్స్‌ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉంటే 305 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు, కూరగాయల ఉత్పత్తి వచ్చిందని మంత్రి తెలిపారు.