కన్‌ బనేగా కరోడ్‌పతితో బాగా సంపాదించా.. ఆ తర్వాత అన్నీ కోల్పోయా !!


బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కన్‌ బనేగా కరోడ్‌పతిలో రూ. రూ.5 కోట్లు గెలిచాడు బిహార్‌ తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహరికి చెందిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ సుశీల్‌ కుమార్‌.. 2011 లో కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి కేబీసీలో రూ.5 కోట్లు గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచారు.

అనంతరం సుశీల్‌ కుమార్‌ జీవితం సవాలుగా మారింది. ఎంతో ఉన్నతస్థాయికి వెళ్లాల్సిన సుశీల్‌ కుమార్‌.. కష్టం లేకుండా వచ్చిన డబ్బు కారణంగా తనలోని మంచి లక్షణాలను బయటకు నెట్టేసి దురలవాట్లకు దగ్గరయ్యాడు. అతిగా మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వంటి అలవాట్లకు బానిసగా మారాడు. దగ్గరివాళ్ల చేతిలో మోసపోవడమే కాకుండా భార్యతో సంబంధాన్ని తుంచేసుకునే స్థాయికి చేరుకున్నాడు.

కేబీసీలో కోట్లు సంపాదించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో సవివరంగా చెప్పుకొచ్చారు. 2015 నుంచి 2016 వరకు నా జీవితంలో చాలా కష్టమైన సమయం. ఏమి చేయాలో కూడా గుర్తించలేకపోయాను. చెడు అలవాట్లకు బానిసగా మారి యధేచ్చగా డబ్బు ఖర్చు చేశానని, పరోపకారిగా కొందరికి డబ్బు సాయం చేశాను. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా అవి ఫ్లాప్‌ అయ్యాయి. భార్యతో సంబంధం దెబ్బతినేలా ప్రవర్తించాను. దాదాపు విడాకులు తీసుకునే స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చారు.