బీహార్ ఎన్నికలు : మహా కూటమి మేనిఫెస్టో విడుదల

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు మహా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా మహాగట్‌ బంధన్(మహా కూటమి) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే, వ్యవసాయ చట్టాలను రద్దుచేసే బిల్లుపైనే మొదటి సంతకం ఉంటుందని స్పష్టం చేసింది. యువతకు ఉద్యోగాల కల్పనను కూడా ప్రధానంగా ప్రస్తావించింది.

కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం తీరును తప్పుపట్టారు. వరదతో ప్రభావితమైన ప్రజలను పరామర్శించేందుకు ఇంతవరకు కేంద్ర బృందం బిహార్‌లో పర్యటించలేదని దుయ్యబట్టారు. ‘అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో వారు బిజీగా ఉన్నారని ఈ తీరు స్పష్టం చేస్తోంది. ప్రజలకు సేవ చేయడమే తమ పని అని వారు గొప్పగా చెప్పుకుంటారు’ అని విమర్శలు చేశారు.

ఇటీవల, 243 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేసినట్లు కూటమి ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. నవంబరు 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.