నియంత్రిత సాగుపై కేసీఆర్ కీలక భేటీ

తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం సూచించిన పంటలని రైతులు సాగు చేయాల్సి ఉంటుంది. అందరు ఒకే రకం పంటలు పండించకుండా.. ప్రాంతాల వారీగా వైవిధ్యమైన పంటలు పండిస్తే.. ఆ పండిన పంటలకి డిమాండ్ ఉంటుంది. తద్వారా రైతులు లాభపడతారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసే పనిలో ఉన్నారు.

నియంత్రిత పంటల సాగుపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో వర్షా కాలం సీజన్‌ నుంచి అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? ఏ రకం విత్తనం వాడాలి? పర్యవేక్షణ, ఇతర అంశాలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.