లాక్ డౌన్ విజయవంతం అవుతోంది : కేసీఆర్

రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్నదని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సిఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని కాపాడవచ్చన్నారు. ఇక బుధవారం తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 41కి చేరింది.