ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోయొద్దు !

దిశా హత్యకేసు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న అమ్మాయిలు 100 డయల్ చేయాలని, సోషల్ మీడియా యాప్స్ ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. దిశాని అతి దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసి.. బాటిల్ లో పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోలు పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోసే బంక్ ల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు శంషాబాద్ డీసీపీ.. జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి పేరు, ఫోన్ నంబరు, వాహనం నంబర్లు పెట్రోలు బంక్ సిబ్బంది సేకరించుకోవాలన్నారు.