దుబ్బాక ఉప ఎన్నిక.. అప్పుడే డబ్బుల వరద !

దుబ్బాక ఉప ఎన్నికలో డబ్బుల వరద పారబోతుంది. ఇంకా నామినేషన్స్ కూడా దాఖలు కాకముందే భారీగా నగదు పట్టుబడుతోంది. ఇటీవల శామీర్ పేటలో రూ. 40లక్షలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ డబ్బు బీజేపీ అభ్యర్థి రఘునందన్ వి అని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తొంది. తాజాగా భూంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అక్బర్‌పేట చౌరస్తాలో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

ఓ కారులో తరలిస్తున్న రూ. 2 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని ములుగు జిల్లా సింగరకుంటపల్లికి చెందిన సీహెచ్ రాజేందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున డబ్బులు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ నిర్వహించడం జరుగుతుందని, రూ. 50 వేలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకెళ్లొద్దని సూచించారు.