సీబీఎస్ఈ పరీక్షల రద్దు

సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షలని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం సుప్రీం కోర్టుకి తెలిపింది. సీబీఎస్ ఈ పరీక్షల రద్దుని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు వైరస్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు తెలిపారు. 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించిందని వెల్లడించారు. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.