ప్రైవేటుకు వెళ్లకండి.. అప్పులపాలు కాకండి : ఈటెల


కరోనా చికిత్స కోసం ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులకి వెళ్లవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఝప్తి చేశారు. రూ.లక్ష రూపాయలయ్యే కరోనా చికిత్సకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.30లక్షల వరకు వసూలు చేయడం సబబు కాదని ఆయన ఆక్షేపించారు.

హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌, కాలనీ అసోసియేషన్లతో మంత్రి ఈటల శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజల్లో భయం పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరో 100 దవాఖానాలు త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో మొత్తంగా 145 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.