తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన చేశారు. అన్ని పరీక్షలు దసరా తర్వాతే ఉంటాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్ సహా తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రాష్ట్ర విద్యాశాఖ తాజా నిర్ణయం తీసుకుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ-హెచ్, అంబేద్కర్ వర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని పరీక్షలు నిలిచిపోయాయి. బీఈడీ పరీక్షలు, డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ పరీక్షలు కొన్నిరోజుల కిందట వాయిదా పడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో అన్ని ప్రవేశ పరీక్షలతో పాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను కూడా దసరా వరకు వాయిదా వేస్తున్నామని మంత్రి వివరించారు. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.