కరోనా కేసులు దాచడంపై కేటీఆర్ స్పందన

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 2వేలకి పైగా నమోదవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యని దాస్తుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పరీక్షలు చేయట్లేదు.. డేటా దాస్తున్నారని అనవసర విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని ప్రశ్నించారు. అక్కడక్కడా లోపాలు లేవని మాత్రం తాను అనడం లేదని చెప్పారు.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు మొత్తం లాక్‌డౌన్‌ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకొనే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23 వేల కేసులు వెలుగుచూస్తే.. మరణాలు 300 వరకే నమోదయ్యాయని కేటీఆర్‌ అన్నారు.