ఐపీఎల్ : ఢిల్లీపై ముంబై గెలుపు

అబుదాబి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (69*; 52 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో, 4×4, 1×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్‌ (53; 36 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ (53; 32 బంతుల్లో, 6×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు

ముంబయికి గొప్ప ఆరంభమేమి దక్కలేదు. నిదానంగా ఆడిన రోహిత్ శర్మ (5, 12 బంతుల్లో) అయిదో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో డికాక్‌ 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరులో ఇషాన్ కిషన్‌ (28; 15 బంతుల్లో, 4×4, 2×6)తో కలిసి సూర్యకుమార్ మరింత చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లు సాధిస్తూ 30 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేశాడు.దీంతో ముంబై విజయానికి దగ్గరైంది. చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా కృనాల్ పాండ్య (12*, 7 బంతుల్లో, 2×4) రెండు బౌండరీలు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. పొలార్డ్ (11*, 14 బంతుల్లో, 1×4) కూడా క్రీజులోనే ఉన్నాడు