అవే.. నాయిని ఆభరణాలు !

అనారోగ్యంతో మాజీ మంత్రినాయిని నరసింహారెడ్ది బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలిసి అభిమానులు తల్లడిల్లారు. రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఆత్మబలం.. గంభీర స్వరం.. కార్మికులు, ప్రజలను ఆదుకునేందుకు ఎంతకైనా తెగించి పోరాడేతత్వం..ఇవీ నాయిని నర్సింహారెడ్డి ఆభరణాలు.

4వ తరగతి చదువుతున్నపుడు ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ మీటింగ్‌కు నాయిని వెళ్లారు. తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. రాజకీయాలు, యజమాన్యాలకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలనే నిబంధనలతో హింద్‌ మజ్దూర్‌ సభ సిద్ధాంతాలను ఔపోసన పట్టి ఆచరించారు.
బేగంబజార్‌ పహిల్వాన్లతో కుస్తీ పట్టేవారు. చార్మినార్‌, బేగంబజార్‌, కోవాబేలా, లాడ్‌బజార్‌లో చిరువ్యాపారులతో యూనియన్‌ ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ సమయంలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు. తెరాస ఆవిర్భావం నుంచి తుదిశ్వాస వరకు.. ఆ పార్టీలోనే ఉన్నారు.