ఏపీలో దున్నపోతు పాలన

సీఎం జన్ సర్కార్ పై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో అరాచకపాలన, దున్నపోతు పాలన నడుస్తున్నాయన్నారు.  ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప, ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు. తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వుంటే వైసీపీ వుండేదా? అని ప్రశ్నించారు.  

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  ఎన్నో దాడులు చేశారని, 690 కేసులు బనాయించారంటూ వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు. ‘కూర్చుంటే కేసు, నిలబడితే కేసు’ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దిశ ఘటనపై స్పందించిన చంద్రబాబు మానవ మృగాలను ఉరితీయాలన్నారు. నాగరిక ప్రపంచం అసహ్యించుకునే విధంగా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం ఎంత దారుణమని అన్నారు. మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారని, ఇలాంటి దుర్మార్గులు ఈ గడ్డపై వుండడానికి వీలు లేదని, ఉరేస్తే తప్ప మిగిలినవాళ్లు భయపడరని చంద్రబాబు అన్నారు.