రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై చంద్రబాబు స్పందన

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చరిత్రలో ఈరోజు చీకటిదినం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు తమ భూములు త్యాగం చేశారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ఆ భూములు ఇచ్చారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రాజధానిని నాశనం చేసింది. రాజధాని విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల స్వప్నం నీరుగార్చారు.

ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు. ఈ బిల్లులను తీసుకొచ్చి విభజన చట్టానికి చిల్లులు పొడిచారు. రాజధాని బిల్లుకు మద్దతిస్తున్నానని జగన్‌ ఆ రోజు సభలో చెప్పారు. ఇప్పుడు జగన్‌ మడమ తిప్పి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. కానీ మూడు రాజధానుల పేరుతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అని చంద్రబాబు విమర్శించారు. అంతేకాదు.. గవర్నర్ నిర్ణయంపై పోరాటం చేస్తామన్నారు.