బోరున ఏడ్చేసిన నిర్భయ తల్లి

మన న్యాయ వ్యవస్థ లొసుగులని ఆసరగా చేసుకొని నిర్భయ దోషులు ఉరిశిక్షని మరింత ఆలస్యం అయ్యేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మేమూ మనుషులమే. ఏడేళ్లయింది. నా కూతురికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దోషులను ఉరితీయండి’ అని నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల శిక్ష అమలుకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నిర్భయ తల్లి కోర్టు గదిలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.