నటి నుస్రత్‌ జహాన్’కు మళ్లీ బెదిరింపులు

‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సినీనటి నుస్రత్‌ జహాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దుర్గామాత వేషధారణలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆమెను చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.

ఆమె ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం దుర్గామాత వేషధారణలో వస్త్రాలు ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకున్న ఓ ఫొటోను సెప్టెంబర్‌ 17న ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, ఈ నెల 27న ఆమె ఓ సినిమా షూటింగ్‌ కోసం లండన్‌కు వెళ్లడంతో నుస్రత్‌ కార్యాలయ సిబ్బంది ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని బెంగాల్‌ ప్రభుత్వంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఆమె సన్నిహితులు ఒకరు తెలిపారు. దీంతో నుస్రత్ కి భద్రత ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.