దిశపై తప్పుడు ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్

హైదరాబాద్ శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ అతి దారుణంగా అత్యాచారానికి గురై.. హత్యకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకి పోలీసులు దిశ అని పేరు పెట్టారు. యువతి ప్రతిష్టకి భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకొన్నారు. సోషల్ మీడియాను హత్యకి గురైన వైద్యురాలి పేరుని ప్రస్తావించవద్దని, ఆమెని, ఆమె కుటుంగ సభ్యుల ఫోటోలు కూడా వాడకూడదని పోలీసులు హెచ్చరించారు. అయినా.. సోషల్ మీడియాలో దిశపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి.

తాజాగా ఫేస్ బుక్ లో దిశపై అసభ్య ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతపరిచిన దిశపై కించపరిచేలా, అత్యాచారాలను సైతం సమర్థించేలా కొందరు వికృతంగా కామెంట్లు పెడుతున్నారు. నీచంగా పెడుతున్న కామెంట్లు ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన స్టాలిన్ శ్రీరామ్‌ను సీసీఎస్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.