ఆన్ లైన్’లో పందెం కోళ్లు

సంక్రాంతి వచ్చేస్తోంది. కోడి పందాలు మొదలయ్యాయి. పందెంకోళ్లకి భలే గిరాకీ. వేలల్లో ధరలు పలుకుతున్నాయి. ఈసారి పెంపకందార్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాము పెంచిన కోళ్లతో సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకొని ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది పెంపకందారులు ‘నూజివీడు కాక్స్‌’, అనంతపురం జిల్లా పెంపకదారులు ‘జాతికోళ్ల పెంపకం’, నెల్లూరు పెంపకందారులు ‘జాతికోళ్ల పెంపకం సేల్స్‌’ పేర్లతో ఫేస్‌ బుక్‌లలో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు.

వీటిలో ఆయా కోళ్లు తలపడే సన్నివేశాలను, కోళ్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు. కొంతమంది ఏకంగా కోళ్ల రకాలు.. వాటి ధరలనూ ప్రదర్శిస్తున్నారు. పనిలో పనిగా సెల్‌ఫోన్‌ నెంబర్లను పంపించి క్రయ, విక్రయాలకు తెరదీస్తున్నారు. దీంతో పందెం కోళ్ల మార్కెట్‌ కొత్త తరహాలో పరుగులు తీస్తోంది. మరోవైపు, సంక్రాంతి సమయంలో కోడి పందేలను జరగనిచ్చేది లేదు…ఉక్కు పాదంతో అణచివేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా.. పందెం రాయుళ్లు ఏమాత్రం తగ్గడం లేదు.