రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోని ప్రేమిస్తున్నా : పరిణీతి

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్య కూతురు సారా అలీఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తుంది. అలాంటి సైఫ్ ప్రేమలో పడింది యంగ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. సైఫ్‌ అలీఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. సైఫ్‌ను చాలా ప్రేమిస్తున్నానని, ఆ విషయం కరీనాకు కూడా చెప్పానని చెప్పింది.

పరిణీతి 33వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా`ది కపిల్ శర్మ షో`కు హాజరైంది. ఆ కార్యక్రమంలో `నిజ జీవితంలో ఒక వ్యక్తిని అపహరించడానికి అవకాశం ఇస్తే ఎవరిని అపహరిస్తార`ని పరిణీతికి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన పరిణీతి.. `ఒకరిని కలవడానికి నాకు అవకాశం రాక.. అతణ్ని కిడ్నాప్ చేయాల్సి వస్తే నేను సైఫ్ అలీఖాన్‌ను ఎంచుకుంటా. ఎందుకంటే నేను అతణ్ని చాలా ప్రేమిస్తున్నా. ఆ విషయం కరీనాకు కూడా చెప్పాను. నేను సైఫ్‌ను దూరం నుంచి ప్రేమిస్తాన`ని చెప్పుకొచ్చింది.