శివాజీ రాజా పెద్ద మనసు

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కరోనా గురించి అవగాహన పెంపొందిస్తూ చైతన్యం నింపుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు తమ విలువైన సలహాలు, సూచనలు ప్రజలకు అందజేశారు. పలువురు వారి వద్ద పనిచేస్తున్న నిరుపేదలకు తోచిన సాయం అందించారు.

తాజాగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ముందుకు వచ్చారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన రకరకాల కూరగాయలు, ఆకు కూరలను తన సన్నిహితులు, నిరుపేద కళాకారులకు పంపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పలువురు నిరుపేద నటీనటులకు తాను నిత్యావసర సరుకులు పంపనున్నట్లు వెల్లడించారు. బియ్యం, పప్పు, కూరగాయలు వంటి సరుకులను పంపించనున్నట్లు తెలిపారు.