సుశాంత్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్ట మార్టమ్ రిపోర్ట్ వచ్చేసింది. ఆదివారం ఉదయాన్నే జ్యూస్‌ తాగి, మళ్లీ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని ఇంట్లో పనిచేసే వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ఎంతసేపటికీ సుశాంత్‌ బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా, బెడ్‌షీట్‌ సాయంతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సుశాంత్‌ కనిపించారు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు, 108కి కాల్‌ చేసి చెప్పారు. అప్పటికే సుశాంత్‌ మృతిచెందారు. ఆయన గదిలో ఎటువంటి సూసైడ్‌నోట్‌ దొరకలేదు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో సుశాంత్ ఎలా చనిపోయాడన్నది తెలుస్తుందని భావించారు.

ముంబయిలోని కూపర్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రిలో సుశాంత్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక సుశాంత్‌ మృతి చెందారని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ‘వైద్యులు పోలీసులకు పోస్ట్‌మార్టం నివేదిక అప్పగించారు. ముగ్గురు వైద్యులు శవపరీక్ష చేశారు. ఉరి వేసుకోవడం వల్లే ఆయన మరణించారు’ అని డీసీపీ అభిషేక్‌ త్రిముఖ్‌ పేర్కొన్నారు.