తెరాస ప్రజాప్రతినుధుల కరోనా సాయం రూ.500కోట్లు

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కరోనా కట్టడి కోసం తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. యువ హీరో నితిన్ రూ. 10లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికొందరు ముందుకొస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కరోనా కట్టడి కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు.. తమ వంతు సాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిసి దాదాపు 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు.

ఒక్కో ఎంపీకి ఏడాదికి 5 కోట్ల రూపాయలు తమ నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మంజూరయ్యే మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు. దీనికి సంబంధించిన కన్సెంట్ లెటర్ ను టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాశ్, లోకసభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు.

Compose: