పాక్ కి షాకిచ్చిన భద్రతా మండలి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కి షాక్ తగిలింది. కొందరు భారతీయులను పాక్ తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అందుకు భద్రతా మండలి చెక్ చెప్పింది. కొందరు భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్‌ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు కొన్ని పేర్లను ఉంచిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. విదేశాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని కోరింది.

చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది. దీంతో పాకిస్థాన్‌ చర్యను అమెరికా సహా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా, భారత్‌పై పాక్ ఇటువంటి కుట్రలు పన్నడం కొత్తేమీకాదు.‌ ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.