నా ఫెల్యూర్ కి అదే కారణం : ఉతప్ప

ముందు మెరిసి ఆ తర్వాత కనుమరుగైన క్రికెటర్లలో ఉతప్ప ఒకరు. 2006లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఊతప్ప.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన తను తర్వాత కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఊతప్ప 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2015లో జింబాబ్వే పర్యటనలో ఆడాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్న ఉతప్ప.. కెరీర్ ఫెల్యూర్ గురించి తెలిపాడు.

‘భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా అతిపెద్ద లక్ష్యం. దానికి తగ్గట్టు 20-21 ఏళ్ల వయసులోనే ప్రయత్నాలు మొదలు పెడితే బాగుండేది. కానీ 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది. అప్పటివరకు స్థిరంగా ఆడుతూ వస్తున్న నా బ్యాటింగ్‌లో మునపటి పదును తగ్గింది.ముఖ్యంగా గంటలకొద్దీ క్రీజులో ఉండి.. స్థిరంగా రాణించాలనుకున్నా. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది’ అని ఉతప్ప చెప్పుకొచ్చారు.