సీఎం కేసీఆర్ స్పందనపై రాములమ్మ అభ్యంతరం

దిశ ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజలు స్పందిస్తున్నారు. నిందితులని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. నిందితులని కఠినంగా శిక్షించాలన్నారు. ఐతే, దిశ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందనని కాంగ్రెస్ మహిళా నేత, నటి విజయశాంతి తప్పు పట్టారు.
మృగాళ్ల చేతిలో అత్యంత దారుణంగా హతమైన వెటర్నరీ వైద్యురాలి ఘటనపై స్పందించడానికి సీఎం కేసీఆర్ కు మూడ్రోజులు పట్టిందని విమర్శించారు. మహిళా సంఘాలు, మీడియా వర్గాలు తీవ్రస్థాయిలో ప్రశ్నించడంతో మొక్కుబడిగా ఓ ప్రకటనతో సరిపెట్టారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అంటూ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దిశ తల్లిదండ్రులతో అసభ్యకరంగా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం కేసీఆర్ చెప్పలేదని, ఫిర్యాదు అందిన వెంటనే మా పరిధి కాదు అంటూ జరిగే జాప్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించకుండా కేసీఆర్ తప్పించుకున్నారని రాములమ్మ మండిపడ్డారు.